: పాకిస్థాన్ చేరుకున్న చైనా యుద్ధనౌకలు... నిశితంగా పరిశీలిస్తున్న ఇండియా
పాకిస్థాన్ తో మరింత సద్భావన, ఇరు దేశాల నావికా దళ సిబ్బంది మధ్య అవగాహన కల్పించాలన్న నిమిత్తంతో చైనా తలపెట్టిన నౌకాయాత్ర, విన్యాసాల్లో భాగంగా మూడు అత్యాధునిక యుద్ధ నౌకలు పాక్ తీరాన్ని చేరుకున్నాయి. చైనా వార్ షిప్ లు చాంగ్ చున్, జింగ్ ఝౌ, చ్యౌ హులు కరాచీ తీరానికి చేరుకోగా, మరో నాలుగు రోజుల పాటు అవి పాక్ తీరంలోనే మకాం వేయనున్నాయని చైనా నేవీ అధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య సమాచార బట్వాడా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకునేందుకు తమ యాత్ర దోహదపడుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. కాగా, చైనా వార్ షిప్ లు పాక్ తీరంలో చేస్తున్న కార్యకలాపాలను భారత్ నిశితంగా గమనిస్తోంది. పాక్ లోని గ్వదర్ లో ఓ భారీ నౌకాశ్రయం నిర్మాణానికి చైనా ఆర్థిక సహాయాన్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే.