: నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం... భుజాన బ్యాగులేసుకుని స్కూళ్లకి బయల్దేరుతున్న చిన్నారులు!
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. వేసవి సెలవులు ముగిశాయి. సకాలంలో వర్షాలు కురవడంతో ఎండలు తగ్గుముఖం పట్టాయి. వర్షాలు కురుస్తుండడంతో వాతావరణం చల్లబడింది. దీంతో నేటి నుంచి తిరిగి యథావిధిగా స్కూళ్లు తెరుచుకోనున్నాయి. తెలంగాణలో 25,183 ప్రభుత్వ పాఠశాలలుండగా 8,112 పాఠశాలల్లో ఇప్పటికీ కిచెన్ షెడ్లు లేకపోవడం శోచనీయం. దీంతో మధ్యాహ్న భోజన పథకానికి ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. వర్షం వస్తే వంట ఆగిపోతుంది. మరోవైపు 348 పాఠశాలలలో బోధన ఇంకా చెట్ల కిందే జరుగుతోంది. వీటికి పాఠశాల భవనాలు కట్టాల్సి ఉంది. వీటి పరిస్థితి కూడా గందరగోళమే.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7,093 పాఠశాలల్లో పిల్లలకు సరిపడా తరగతి గదులు లేవు, అలాగే సుమారు అన్ని స్కూళ్లలోనూ 27,000 టాయిలెట్ల అవసరముండగా, కేవలం బాలికలకు 12,000 టాయిలెట్ల అవసరముంది. 'స్వచ్ఛభారత్' అంటూ క్యాంపెయిన్ చేసే ప్రభుత్వాలు స్కూళ్లలో మరుగుదొడ్లు కట్టించేందుకు ముందుకు రాకపోవడం బాధాకరం. 2,000 పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేకపోగా, 10,000 పాఠశాలలకు కాంపౌండ్ వాల్ లేదు.
మరోవైపు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం వేసేందుకు సిధ్ధమవుతున్నాయి. 15 నుంచి 25 శాతం వరకు ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచేదిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో చదివించడం ద్వారా మంచి ర్యాంకులు కొల్లగొట్టొచ్చన్న ఆలోచనతో వారిని వాటిల్లో చేర్చేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆయా పాఠశాలలు ఫీజులు భారీగా పెంచుతున్నట్టు తెలుస్తోంది.