: ఒకసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయితే... ఇక కట్టె కాలేవరకు పవన్ కల్యాణ్ ఫ్యానే!: హరీష్ శంకర్
'తెలుగు సినిమాల్లో సాహిత్యం చచ్చిపోతోంది, చచ్చిపోతోందని అని అంతా ఆరోపిస్తుంటారు. మంచి సాహిత్యంతో పాటలు రాస్తే...దానిలో కూడా వివాదాలు రేపితే ఎలా?' అని 'డీజే' సినిమా దర్శకుడు హరీష్ శంకర్ ప్రశ్నించారు. ఒకవేళ అలాంటి వివాదంలో ఏవైనా తిట్టాలనుకుంటే ఆ తిట్లు దర్శకుడైన తనకివ్వాలని... రచయితను పీడించి, పాటలు రాయించేది తానేనని, పాట బాగుంటే కనుక ఆ పాటకు వచ్చే పొగడ్తలను రచయితలకు ఇవ్వండని ఆయన సూచించారు. ఒకసారి పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయితే.. ఇక కట్టె కాలేవరకు పవన్ కళ్యాణ్ ఫ్యానేనని చెప్పాడు.
"గబ్బర్ సింగ్' సినిమా విజయం సాధించిన తరువాత ఆ విజయాన్ని ఆయనతోనే ఆస్వాదించాలని, ఒక్క ఇంటర్వ్యూ ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తే ఆయన... 'విజయం అన్నది మనిషి ఎప్పుడూ చేయని పనులన్నీ చేయిస్తుంది... అవసరం లేని మనుషులతో, అవసరం లేని మాటలు మాటాడిస్తుందని, వాటిని నివారించాలంటే విజయం తరువాత సాధారణంగా ఉండాల'ని ఆయన సూచించారు. అప్పటికీ నేను కన్వీన్స్ చేయడంతో 'సినిమా హిట్టైందా?' అని ఆయన అడిగితే తాను 'అవును సార్...సినిమా సూపర్ హిట్' అని చెప్పాను. దానికి ఆయన 'మరి మనం మాట్లాడాల్సిన అవసరం ఏముంది?' అంటూ మౌనంగా ఉండమన్నారు" అని గుర్తుచేశాడు.
అలాగే డీజే సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్ర కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని చెప్పాడు. బ్రాహ్మణ యాస కోసం మాంసాహారాన్ని మానేశాడని చెప్పాడు. ఈ సినిమాలో బ్రాహ్మణులు గర్వపడేలా చేసే సన్నివేశాలు, సర్ ప్రైజులు ఉన్నాయని హరీష్ శంకర్ తెలిపాడు. దిల్ రాజు లాంటి నిర్మాత దొరకడం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాడు. పూజా హెగ్డే పాత్ర ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాడు.