: గోడల వెనక దాక్కున్నా పట్టేస్తారు... సైన్యం చేతికి తొలిసారిగా మైక్రోవేవ్ వాల్ రాడార్లు


పెద్ద పెద్ద భవనాల్లోని కాంక్రీటు గోడల మధ్య నక్కి ఉన్న ఉగ్రవాదుల ఆచూకీని తెలియజెప్పేలా మైక్రోవేవ్ రేడియేషన్ రాడార్లను భారత సైన్యం సమకూర్చుకుంది. కాశ్మీరు ప్రాంతంలో భవంతుల్లో దాగిన ఉగ్రవాదుల అనుపానులు తెలుసుకునేందుకు అత్యంత ఆధునికమైన రాడార్లను అమెరికా, ఇజ్రాయిల్ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్టు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వీటిని వాడటం ద్వారా ఉగ్రవాదులు సరిగ్గా ఏ ప్రాంతంలో ఉన్నారో భద్రతా దళాలకు తెలిసిపోతుందని, దీనివల్ల సామాన్యులకు, ప్రజలకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు.

దిగుమతి చేసుకున్న ఈ రాడార్ సిస్టమ్స్ ను ఉగ్రవాదుల సమాచారం గురించి తెలిసిన ప్రాంతాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేసినట్టు తెలిపారు. ఈ తరహా హైటెక్ రాడార్లను మరిన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని సైనిక వర్గాలు వెల్లడించాయి. కాగా, గత సంవత్సరం జూలై 8న హిజ్బుల్ ముజాహిద్దీన్ పోస్టర్ బాయ్ బుర్హాన్ వానీని అనంతనాగ్ జిల్లాలో మట్టుబెట్టిన తరువాత, కాశ్మీర్ లోయలో ప్రారంభమైన అల్లర్లు, ఇప్పటివరకూ తగ్గలేదన్న సంగతి తెలిసిందే. నూతన రాడార్లను దేశంలోనే తయారు చేసుకునేందుకు డీఆర్డీఓ అనుబంధ ఎల్ఆర్డీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్ మెంట్ ఎస్టాబ్లిష్ మెంట్) కృషి చేస్తోంది.

  • Loading...

More Telugu News