: ఫేస్‌బుక్ లైవ్‌లో మీసం తిప్పి... డైలాగు కొట్టిన బాలయ్య!
తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు నందమూరి బాలకృష్ణ... దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి పోర్చుగల్ నుంచి ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడారు. ఫేస్‌బుక్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణని ఓ అభిమాని ఓ డైలాగ్ చెప్పమని అడిగాడు. దీంతో బాలయ్య... ‘చూడూ ఒకవైపే చూడు మరోవైపు చూడకు మాడిపోతావ్.. మసై పోతావ్’ అంటూ డైలాగ్ వదిలాడు.. అనంతరం ఓ అభిమాని మీసం తిప్పమని బాలయ్యను అడిగాడు... దీంతో బాలయ్య మీసం తిప్పాడు. ఈ వీడియోను మూడున్నర లక్షల మంది చూశారు. ‘బాలయ్య బాబు... మీరు, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఎప్పుడు చేస్తారు?’ ఆ మూవీని చూడాలని నందమూరి ఫాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారని ఒకరు అడిగిన ప్రశ్నకు బాలయ్య నుంచి సమాధానం రాలేదు.
‘కోటి కాంతుల చిరునవ్వులతో, సకల సుఖశాంతులు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని.. ఇంకా ఎన్నో, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆ భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. దానికి బాలయ్య థ్యాంక్యు చెప్పాడు. ‘తెలుగు వాడి పవర్ ఎక్కువ.. మా బాలయ్య బాబుకి పొగరు ఎక్కువ.. జై బాలయ్య బాబు’ అంటూ ఓ అభిమాని విసిరిన డైలాగుకి బాలయ్య, పూరీ హర్షం వ్యక్తం చేశారు. ‘మా నందమూరి అందగాడు బాలయ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేశారు.