: మాజీ ఏఎస్పీ వద్ద కళ్లు చెదిరే అక్రమాస్తులు.. రూ.400 కోట్లు కూడబెట్టాడు... ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నాడు!
కేరళలోని కోచిలో ఓ మాజీ ఏఎస్పీ కూడబెట్టిన అక్రమస్తులను గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. నాగాలాండ్‌లో ఏఎస్పీగా పనిచేసిన ఆయన రూ.400 కోట్ల విలువైన ఓ సంస్థకు అధినేత. అంతేకాదు ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్రపతి అవార్డు కూడా అందుకోవడం గమనార్హం.
నాగాలాండ్‌లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేసిన ఎంకేఆర్ పిళ్లై.. పలువురు రాజకీయ నాయకులు, టాప్ బ్యూరోక్రాట్ల వద్ద పనిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వ నిధులను ఏమైనా అక్రమంగా దారి మళ్లించారా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కోణంలోనే పిళ్లైను ప్రశ్నించనున్నట్టు తెలిపారు.
కేరళ, కర్ణాటక, నాగాలాండ్, ఢిల్లీలో పిళ్లైకి చెందిన శ్రీవలసమ్ గ్రూప్ కార్యాలయాలపై అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై ఈ దాడులు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత తన ఆస్తులు రూ.50 కోట్లని పిళ్లై ప్రకటించారు. అయితే అతడు చెప్పిన లెక్కలకు, చూపించిన ఆదాయానికి పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన ఐటీ అధికారులు దర్యాప్తు ప్రారంభించగా అక్రమ డొంక బయటపడింది.