: పదో తరగతి ఫలితాల్లో టాప్ లేపిన పనిమనిషి.. యూపీ బోర్డ్ ఎగ్జామ్స్‌లో 74 శాతం మార్కులు!
సాధించాలనే తపన ఉండాలే కానీ దానిని ఏవీ నిలువరించలేవని నిరూపించిందో పనిమనిషి. తల్లితో కలిసి పాచిపనులు చేసే ఓ అమ్మాయి శుక్రవారం విడుదలైన ఉత్తరప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్‌లో పదో తరగతిలో 74 శాతం మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఆ ఘనత సాధించిన బాలిక పేరు మనీషా కశ్యప్ (15). మనీషా తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి సంపాదించేది నెలకు రూ.5 వేలే. ఆరుగురు సభ్యులు ఉన్న ఆ కుటుంబ అవసరాలకు అది ఎంతమాత్రమూ సరిపోకపోవడంతో పిల్లలను స్కూలుకు పంపడం మానేశారు. అయితే మనీషా మాత్రం చదువుకోవాలని నిర్ణయించుకుంది. పనిమనిషిగా చేరి, వచ్చిన డబ్బులతో స్కూలు ఫీజులు కడుతూ చదువుకుంది.
‘‘నేను ప్రతిరోజు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తా. కుటుంబానికి ఆహారం వండి స్కూలుకు వెళ్తా’’ అని మనీషా గర్వంగా చెప్పింది. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే మనీషా తండ్రి సోమాలియా కశ్యప్ కుమార్తె మార్కులు చూసి పొంగిపోతున్నాడు. కుమార్తె సాధించిన విజయం గురించి ఉబ్బితబ్బిబ్బవుతున్న తల్లి మున్ని కశ్యప్ ఎంత కష్టమైనా కుమార్తెను పై చదువులు చదివిస్తానని చెప్పుకొచ్చింది. ఇక, టీచర్ కావడమే తన లక్ష్యమని మనీషా తెలిపింది.