: డ్రాగన్ కు తగిలిన ఉగ్ర దెబ్బ... పాక్ లో ఇద్దరు చైనా టీచర్లను కిడ్నాప్ చేసి హత్య చేసిన ఐఎస్ఐఎస్
ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్థాన్ కు అన్ని రంగాల్లో వెన్నుదన్నుగా ఉన్న చైనాకు ఉగ్రవాద దెబ్బ రుచి తగిలింది. పాక్ లోని బెలూచిస్థాన్ ప్రావిన్స్ పరిధిలో పని చేస్తున్న ఇద్దరు చైనా టీచర్లను కిడ్నాప్ చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వారిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని టెర్రర్ సంస్థ నిర్వహించే 'అమాక్ న్యూస్ ఏజన్సీ' వెల్లడించింది. చైనా నుంచి వచ్చి పని చేస్తున్న కార్మికులకు అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన పాక్ ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతుండగా, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చైనా పేర్కొంది.
గత కొంతకాలంగా వారిని కాపాడే యత్నాలు సాగుతున్నాయని, ప్రస్తుతం తమకు అందిన వార్తపై నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా, భాషా పండితులుగా పనిచేస్తున్న వీరిద్దరినీ క్వెట్టాలో మే 24న సాయుధులైన ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వీరిద్దరినీ విడిపించాలని ప్రయత్నాలు జరుగుతుండగానే ఈ వార్త బయటకు వచ్చింది. ఈ సమాచారం నిజమైనదేనా అన్న విషయమై విచారిస్తున్నామని బెలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై పాక్ ప్రభుత్వం మాత్రం ఇంకా స్పందించలేదు.