: జగన్ కల నెరవేరే సమస్యే లేదు: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనీసం 20 నుంచి 30 సంవత్సరాల పాటు సాగాలన్నది వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆశయమని, అందుకోసమే అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు తన హయాంలోనే పూర్తవుతుందని, పనులను వేగంగా చేసేందుకు అధికారులు కృత నిశ్చయంతో ఉన్నారని, నిధులకు ఎంతమాత్రమూ కొరతలేదని, నాణ్యతతో పనులు సాగుతున్నాయని చెప్పారు. ప్రాజెక్టు ఆలస్యం కావాలన్న జగన్ కల నెరవేరబోదని ఎద్దేవా చేశారు. ఇది ఏపీ అవసరాలకు ఉపయోగపడే ప్రాజెక్టు కాబట్టి, సరైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న ఆలోచనతోనే నిధులిచ్చేందుకు నీతి ఆయోగ్ నిర్ణయించిందని తెలిపారు. ఒక్క రూపాయి ప్రజాధనం కూడా దుర్వినియోగం కాకుండా చూసుకుంటున్నానని తెలిపారు.