: ఆర్ఎస్ఎస్ వెబ్ సైట్ ద్వారా త్వరలో గోమూత్రం ఉత్పత్తుల అమ్మకాలు!
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) త్వరలో ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభించనుంది. ఔషధ విలువలు ఉన్న గోమూత్రం, దాని ఉత్పత్తుల ద్వారా తయారు చేసే మందులను ఈ వెబ్ సైట్ ద్వారా విక్రయించనున్నట్టు ఆర్ఎస్ఎస్ నేతలు తెలిపారు. మథురలోని దీన్ దయాళ్ బాగ్ ఫార్మాసూటికల్ ల్యాబ్ లో ఆయా ఉత్పత్తులను తయారీ చేస్తామని, కేన్సర్, మధుమేహ వ్యాధులకూ తమ వెబ్ సైట్ ద్వారా మందులు విక్రయిస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా దీన్ దయాళ్ బాగ్ డిప్యూటీ సెక్రటరీ మనీష్ గుప్తా, డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ, తాము తయారు చేయనున్న మందుల్లో ఎటువంటి కెమికల్స్ ను ఉపయోగించమని, కేవలం గోమూత్రం, పేడను మాత్రమే ఉపయోగించాల్సిన మోతాదులో వాడతామని చెప్పారు. గో మూత్రానికి స్థానికంగానే కాకుండా బయట ప్రాంతాల్లో కూడా మంచి డిమాండ్ ఉందని అన్నారు. గోమూత్రం, ఆవు పిడకలు, సబ్బులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ధరించేటటువంటి కుర్తాలను తమ వెబ్ సైట్ ద్వారా విక్రయిస్తామని చెప్పారు.