: అమానుషం: ఆటోలో మహిళపై అత్యాచారం.. ఆమె చేతిలోని చిన్నారిని రోడ్డుపైకి విసిరేసిన దుండగులు!
హరియాణాలోని గురుగ్రామ్‌లో అమానుషం చోటుచేసుకుంది. తన ఎనిమిది నెలల కుమార్తెతో కలిసి ఆటో ఎక్కిన మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేయడమే కాకుండా ఆమె చేతిలోని చిన్నారిని రోడ్డుపైకి విసిరేశారు. ఫలితంగా తలకు తీవ్రగాయమైన చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మే 29న ఈ ఘటన జరగ్గా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య, వేధింపుల కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. 23 ఏళ్ల బాధితురాలికి భర్త, ఇరుగుపొరుగు వారితో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో భర్త కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. బాధిత మహిళ ఆ రాత్రి ఖండా రోడ్డులో ఉండే తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది. ఆటో ఎక్కిన వెంటనే దుండగులు తన పక్కకు వచ్చి వేధించడం మొదలుపెట్టారని, ఏడుస్తున్న పాపను బలవంతంగా తన చేతుల్లోంచి లాక్కుని రోడ్డుపైకి విసిరేశారని ఏడుస్తూ పేర్కొంది. తనపై అత్యాచారం చేసిన అనంతరం వారు పారిపోయారని వివరించింది.