: పవన్ కల్యాణ్ మద్దతు తెలపడం చాలా సంతోషకరం: రఘువీరారెడ్డి


గుంటూరులో రాహుల్ గాంధీ సభ విజయవంతమైందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చేందుకే రాహుల్ గాంధీ సభను నిర్వహించారని చెప్పారు. ప్రత్యేక హోదాపై పోరాడుతున్న అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. హోదా కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు జనసేనాని పవన్ కల్యాణ్, ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ లు మద్దతు తెలపడం సంతోషకరమని చెప్పారు.

హాదాకు అన్ని పార్టీలు మద్దతిస్తున్నా... టీడీపీ మాత్రం అడ్డుపడుతోందని రఘువీరా ఆరోపించారు. రాహుల్ సభను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే, వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అనేది ఏపీ ప్రజల హక్కు అని చెప్పారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు, విభజన చట్టంలోని హామీలన్నింటినీ నెరవేరుస్తామంటేనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామంటూ టీడీపీ, వైసీపీలు డిమాండ్ చేయాలని అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News