: తవుడుతో లాభాలెన్నో.. తెలిసి ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు.. ఆరోగ్యానికి అమృతమన్న అధ్యయనకారులు!
రైస్ బ్రాన్.. తవుడుతో కలిగే లాభాలు తెలిసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. మానవ శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో సగం కంటే ఎక్కువ విటమిన్లను కొద్దిపాటి తవుడు అందిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శరీరానికి ముఖ్యమైన థయామిన్, నియాసిన్, విటమిన్ బి6 వంటి ముఖ్యమైన విటమిన్లతోపాటు పోషకాహార లోపాన్ని నివారిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిని రోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని పేర్కొన్నారు.
నిజానికి తవుడును పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇందులో 453 మెటబాలిటీలు ఉన్నాయి. వీటిలో 65 మెటబాలిటీలకు ఔషధ గుణాలు ఉన్నాయి. అంతేకాదు గతంలో గుర్తించని 16 గుణాలను గుర్తించినట్టు కొలరాడో స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలిజబెత్ ర్యాన్ పేర్కొన్నారు. అణువంత తవుడులోనూ విటమిన్లు, అమినో ఆమ్లాలు దాదాపు 50 శాతం వరకు ఉన్నట్టు తెలిసి ఆశ్చర్యపోయినట్టు ఎలిజబెత్ పేర్కొన్నారు. కాగా, ప్రపంచంలోని సగానికి పైగా జనాభాకు అన్నమే ఆహారం. వందకు పైగా దేశాలు వరిని పండిస్తున్నాయి.