: బస్సులపై ‘జై మహారాష్ట్ర’.. స్వాగతం పలికిన వారిపై కర్ణాటకలో దేశద్రోహం కేసు!
‘జై మహారాష్ట్ర’ అని రాసి ఉన్న బస్సులను కర్ణాటకలో ఆహ్వానించిన ‘మహారాష్ట్ర ఏకీకరణ్ సమితి’ కార్యకర్తలపై కర్ణాటకలో దేశద్రోహం కింద కేసు నమోదైంది. డ్రైవర్, కండక్టర్ సహా 12 మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) శుక్రవారం ‘జై మహారాష్ట్ర’ అనే లోగోతో ఉన్న బస్సులను ప్రారంభించింది. ఇవి ముంబై- కర్ణాటకలోని బెల్గాం మధ్య సేవలు అందించనున్నాయి.
అయితే ఈ స్లోగన్‌పై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొంది. గతవారం కర్ణాటక మంత్రి రోషన్ బేగ్ మాట్లాడుతూ ‘జై మహారాష్ట్ర’ అని ఎవరు నినదించినా వారి ఉద్యోగాలు పోవడం ఖాయమని ఉద్యోగులను హెచ్చరించారు. తాజాగా మహారాష్ట్ర బస్సులకు బెల్గాంలో స్వాగతం పలికిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు.