: మనల్ని ఎగతాళి చేయడానికి, పుండు మీద కారం చల్లడానికి రాహుల్ గాంధీ రేపు వస్తున్నారు: చంద్రబాబు ఆగ్రహం
ఈ రోజు విజయవాడలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము రాష్ట్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూనే ఉన్నామని అన్నారు. మోదీ ప్రధాని కాగానే పోలవరం ముంపు మండలాల కోసం పట్టుబట్టానని చెప్పారు. అవి రాకపోతే ఇప్పుడు పోలవరం సాధ్యం అయ్యేదా? అని ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా పేరివ్వలేకపోతున్నాం కానీ, దానివల్ల వచ్చే ప్రయోజనాలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు.
ప్రతిపక్ష పార్టీలు చేస్తోన్న విమర్శల పట్ల చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రేపైతే సాక్షాత్తూ రాహుల్ గాంధీ ఇక్కడికి వస్తున్నారు.. అంటే మనం కష్టాల్లో ఉంటే, మన పొట్టగొట్టిన వాళ్లు మళ్లీ మనం ఏ విధంగా ఉన్నామో చూసి, మనల్ని ఎగతాళి చేయడానికి వస్తున్నారు. అంటే మన రాష్ట్రాన్ని దెబ్బకొట్టి, ఆ దెబ్బ మానకముందే పుండుపై కారం చల్లడానికి వస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సరిగా విభజన చేసి ఉంటే, ఇరు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా చేసి ఉంటే మనకిప్పుడు ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కావు. మళ్లీ ఇప్పుడు ఏవేవో మాట్లాడడానికి వస్తున్నారు. మన పొట్టగొట్టింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీని భూస్థాపితం చేయాలి’ అని చంద్రబాబు అన్నారు.