: ఇళ్ల ముందు 'వివాహేత‌ర‌ సంబంధ లేఖ‌లు' ప‌డేసి వెళుతున్న వృద్ధుడు.. అరెస్ట్!


తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని రావులపాడులోని ఎస్సీ పేటలో 'వివాహేత‌ర‌ సంబంధ లేఖ‌లు' కలకలం రేపాయి. చివ‌రికి ఓ వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేయ‌డంతో వివాదం సద్దుమణిగింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే, ఎస్సీ పేటకు చెందిన పమ్మి శ్రీనుతో పాటు ఆ గ్రామంలోని నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులు వివాహేత‌ర సంబంధాలు పెట్టుకున్నార‌ని పేర్కొంటూ, కొన్ని నెలల నుంచి గుర్తు తెలియ‌ని వ్యక్తి ప‌లు లేఖలను రాత్రి పూట‌ ఆయా ఇళ్ల వద్ద పడేసి వెళుతున్నాడు.

అంతేగాక‌, అస‌భ్య‌ప‌ద‌జాలంతో ప‌లు లేఖ‌ల‌ను పోస్టు ద్వారా కూడా పంపించాడు. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన వ్య‌క్తులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ లేఖ‌లు ఎవ‌రు ప‌డేసి వెళుతున్నార‌నే విష‌యంపై స్థానికులు తాజాగా నిఘా పెట్టగా, నిన్న తెల్లవారుజామున అదే గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరామమూర్తి అనే ఓ వృద్ధుడు ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళుతూ ప‌లు లేఖలను విసిరేశాడు. వెంట‌నే ఆ వృద్ధుడిని ప‌ట్టుకున్న గ్రామ‌స్తులు రామాలయం వద్ద నిర్బంధించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వృద్ధుడిని అరెస్టు చేసి తీసుకువెళతామని చెప్పారు.

అయితే, ఆ వృద్ధుడికి తామే త‌గిన బుద్ధి చెబుతామ‌ని గ్రామస్తులు అడ్డుకున్నారు. పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో, బాధిత కుటుంబాల‌లోని వ్య‌క్తులు ఆవేశంతో త‌మ‌ ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్నారు. చివ‌ర‌కు పోలీసులు వారికి నచ్చజెప్పి, శాంతింప‌జేశారు. త‌మ‌ ప్రాంతానికి చెందిన ఒక యువతి, మరో వ్యక్తితో తాను ఆ లేఖలు రాయించినట్లు ఆ వృద్ధుడు ఒప్పుకున్నాడు. నిందితులంద‌రినీ అరెస్టు చేస్తామ‌ని పోలీసులు చెప్పారు.      

  • Loading...

More Telugu News