: 8 స్పెషల్ పోలీసు టీములు 15 రోజులుగా వెతుకుతుంటే... ప్రేయసి కోసం వచ్చి దొరికిపోయాడు!
గత నెల 17వ తేదీన తనకు ఎస్కార్టుగా వచ్చిన పోలీసుల కన్నుగప్పి పారిపోయిన రిమాండ్ ఖైదీ అత్తినేని చంద్రమోహన్, తన ప్రియురాలి కోసం వచ్చి దొరికిపోయాడు. తప్పించుకున్న ఖైదీ కోసం సీసీఎస్ ప్రత్యేక పోలీసులు సహా, వరంగల్, జగిత్యాల ప్రాంతాలకు చెందిన 8 ప్రత్యేక బృందాలు 15 రోజులుగా గాలిస్తుంటే, ప్రేయసిని కలిసేందుకు రహస్యంగా స్వగ్రామానికి వచ్చిన చంద్రమోహన్ ను స్థానికులు గమనించి బంధించి పోలీసులకు అప్పగించారు. స్వగ్రామమైన అయోధ్యపురంకు చంద్రమోహన్ రావచ్చని భావించిన పోలీసులు, అక్కడ నిఘా ఉంచగా, అతను వచ్చాడన్న సమాచారం అందింది. తన ప్రియురాలి ఇంట్లోనే ఉన్న నిందితుడిని, అతని స్నేహితులే స్వయంగా తాళ్లతో బంధించి పోలీసులకు అప్పగించడం గమనార్హం. ఇక చంద్రమోహన్ ను వరంగల్ సీసీఎస్ పోలీసులకు అప్పగిస్తామని జనగామ పోలీసులు వెల్లడించారు.