: తెలంగాణ ప్రజల గుండెలోతుల్లో బాధ ఉంది కాబట్టే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు: రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రజల గుండెలోతుల్లో బాధ ఉంది కాబట్టే ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు సంగారెడ్డిలో కాంగ్రెస్ నిర్వహించిన ప్రజాగర్జనలో రాహుల్ గాంధీ మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడి ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారని చెప్పారు. కానీ, ఈ ప్రభుత్వాల పాలనలో వ్యవసాయ దారులకు నీళ్లు లేవని, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన యువతకు ఉద్యోగాలు లేవని, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు లేవని ఆయన అన్నారు. ఉద్యమంలో పాల్గొన్న యువకులంతా ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారని, కానీ కేసీఆర్ పాలన వల్ల ఆ కలలు నెరవేరడం లేదని చెప్పారు.
సోనియా గాంధీ తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చారని, అది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని, ఎంతో మంది వ్యతిరేకించినప్పటికీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఎందుకు రావాలని కలలు కన్నారో అవి నెరవేరడం లేదని అన్నారు. ఈ మూడేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల దిశగా పనులు జరిగాయా? అని ప్రశ్నించారు. ఏ విద్యార్థులు, రైతులు అప్పుడు పోరాడారో వారు పోరాడింది కేవలం ఒక కుటుంబం సుఖపడడానికి కాదని కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ? అంటూ రాహుల్ ప్రశ్నించారు.