: స్వాతి-నరేష్ కేసులో యాదాద్రి పోలీసులపై చర్యలు...ఎస్సై సస్పెన్షన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నరేష్ హత్య, స్వాతి ఆత్మహత్య ఘటనలో పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ‘నరేశ్-స్వాతి’ జంట ప్రేమ వివాహం చేసుకున్న సంగతి, ముంబైలో ఉన్న వారిని ఆత్మకూరు ఎస్సై శివనాగప్రసాద్ ఇక్కడికి రప్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన స్వాతితో మాట్లాడిన కాల్ రికార్డింగులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం నరేష్ కనిపించడం లేదంటూ అతని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా, ఆయన పట్టించుకోలేదని, సరైన విధానంలో దర్యాప్తు చేయని కారణంగానే నరేష్ మర్డర్ మిస్టరీగా మారిందని, తద్వారా స్వాతి ఆత్మహత్యకు పాల్పడిందని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు.
ఈ క్రమంలో ఇంత తప్పిదానికి కారణమైన శివనాగప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే భువనగిరి పట్టణ, రామన్నపేట సీఐలు శంకర్, శ్రీనివాస్ లకు ఛార్జ్ మెమో ఇచ్చారు. అలాగే భువనగిరి డీసీపీ పి.వై.గిరి, ఏసీపీ మోహన్ రెడ్డికి కూడా మెమో జారీ చేశారు. మరో కేసులో సివిల్ తగాదాలో 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన మోత్కూరు ఎస్సై రవి కుమార్ ను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.