: స్వరం మార్చిన జర్మనీ.. ప్రధాని ఇటు రాగానే.. అటు చైనా పల్లవి అందుకున్న మీడియా!
భారత ప్రధాని నరేంద్రమోదీ జర్మనీ నుంచి బయలుదేరారో, లేదో.. ఆ వెంటనే చైనా ప్రధాని లి కెఖియాంగ్ బెర్లిన్‌లో వాలిపోయారు. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో చర్చలకు సిద్ధమవుతున్నారు. అప్పటి వరకు భారత్ పాట పాడిన జర్మన్ మీడియా కూడా వెంటనే స్వరం మార్చేసి చైనా పల్లవి అందుకుంది. జర్మనీ అధికారులు కూడా తమకు చైనా చాలా విలువైన మిత్రదేశమని చెబుతున్నారు. ఆర్థిక, వాణిజ్య పరంగా చూస్తే తమకు చైనా చాలా ముఖ్యమని తేల్చి చెబుతున్నారు. యూరప్ అవతల తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనాయేనని పేర్కొంటున్నారు. అయితే చైనాతో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెబుతుండడం గమనార్హం.
భారత్ తగిన సమయంలో జర్మనీలో అడుగుపెట్టినా, ఆ దేశం తీరు చూస్తుంటే మాత్రం ఆ సంబంధాలు దీర్ఘకాలం ఉండేలా కనిపించడం లేదని జర్మన్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘‘భారత్ ఇంకా జర్మన్ దృష్టిలో పడలేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక అక్కడి మీడియా ప్రవర్తన కూడా ఒక్కసారిగా మారిపోయింది. మోదీ కంటే చైనా ప్రధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. జర్మనీపై భారత్ మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు జర్మన్ విదేశాంగ కార్యాలయం అసియా-పసిఫిక్ విభాగాన్ని ప్రత్యేకంగా ప్రారంభించింది. భారత్, చైనాలపై మరింత దృష్టిపెట్టడమే ఈ కార్యాలయ విధి. భవిష్యత్తులో భారత్-జర్మనీ మధ్య వాణిజ్య, ఆర్థిక ఒప్పందాలు కుదిరేందుకు అవకాశం ఉన్నా ఈ విషయంలో భారత్ మరింత శ్రమించాల్సి ఉంటుంది. జర్మనీతో వాణిజ్య, పెట్టుబడులపై చర్చల విషయంలో తమపై చాలా ఒత్తిడి ఉందని భారత అధికారులు పేర్కొన్నారు.