: లాలు ర్యాలీకి అఖిలేష్, మాయా కూడా.. ఒక్కొక్కటిగా కలిసి వస్తున్న విపక్షాలు!
ఆగస్టు 27న ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పాట్నాలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి విపక్షాలు ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. ఎన్డీఏను వ్యతిరేకించేవారు తన ర్యాలీలో పాల్గొనవచ్చంటూ లాలు విపక్షాలకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే పలు పార్టీలు ర్యాలీలో పాల్గొనేందుకు ముందుకు రాగా తాజాగా ఎస్పీ, బీఎస్పీలు కూడా ర్యాలీలో పాల్గొననున్నట్టు ప్రకటించాయి.
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ లాలు ర్యాలీలో తాను పాల్గొంటున్నట్టు తెలిపారు. ఆర్జేడీ నుంచి తనకు ఆహ్వానం అందిందని, బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ర్యాలీకి హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ, బీఎస్పీలు రెండూ కలిసి పనిచేసే అవకాశం ఉందా? అన్న మీడియా ప్రశ్నకు అఖిలేశ్ స్పందిస్తూ భవిష్యత్తులో అటువంటిది ఏదైనా జరిగితే తానే ప్రకటిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌తో ఉన్న పొత్తు కొనసాగుతుందని పేర్కొన్న ఆయన, రాహుల్‌గాంధీ తమతో ఉన్నారని, తామెప్పుడూ ఆయనతోనే కలిసి ఉంటామని స్పష్టం చేశారు. తండ్రి ములాయం సింగ్ యాదవ్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని, అదంతా మీడియా సృష్టేనని ఆరోపించారు.