: దాసరి మృతికి సంతాప సూచకంగా... మూడు రోజులు షూటింగు నిలిపేస్తున్న పవన్ కల్యాణ్, త్రివిక్రమ్!
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మృతికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతాపం తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా షూటింగ్ లో వారు బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి దాసరి నారాయణరావు మరణ వార్త తెలిసింది. దీంతో స్పాట్ లో ఉన్న పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ షూటింగ్ ను నిలిపేశారు. అంతే కాదు ప్యాకప్ చెబుతూనే... దాసరి మృతికి సంతాపంగా మూడు రోజుల పాటు షూటింగ్ నిర్వహించకూడదని నిర్ణయించామని... మూడు రోజుల తరువాత షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని యూనిట్ కు తెలిపారు.
కాగా, శ్వాసకోశ ఇబ్బందులతో దాసరి నారాయణరావు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా వీరిద్దరూ వెళ్లి దాసరి నారాయణరావును స్వయంగా పరామర్శించిన సంగతి తెలిసిందే. కాగా, దాసరి మృతికి సంతాపంగా తెలుగు సినీ పరిశ్రమ ఒక్కరోజు బంద్ పాటిస్తుండగా, పవన్ కల్యాణ్ మూడు రోజులు సంతాపదినాలు జరపడం విశేషం.