: హిజ్బుల్ కమాండర్ సబ్జార్ ను సైన్యం ఎలా చంపిందంటే...!
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతాదళాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముష్కరులను మట్టుబెట్టడానికి సైనికులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యనే ఉగ్ర సంస్థ హిబ్జుల్ కమాండర్ బుర్హాన్ వనీని మట్టుబెట్టిన భద్రతాదళాలు... తాజాగా అతని వారసుడు కమాండర్ సబ్జార్ ను కూడా కాల్చి చంపాయి. అయితే, ఈ ఆపరేషన్ కోసం మన భద్రతాదళాలు పడిన శ్రమ, తీసుకున్న రిస్క్ అంతాఇంతా కాదు. ఎంతో ప్లానింగ్ తో ఈ ముష్కరుడిని మన సైన్యం అంతం చేసింది.
సోషల్ మీడియాలో అతను పెట్టుకున్న ఫొటోలే అతడి ఆచూకీని గుర్తించడానికి కారణమయ్యాయి. కశ్మీర్ పోలీసులు తమ రహస్య వేగులకు భారీ ఎత్తున సెల్ ఫోన్లను అందించింది. వారితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ సమాచారం సేకరించేది. ఈ క్రమంలో సబ్జార్, ఫైజాన్ ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు సేకరించారు. వెంటనే ఈ సమాచారాన్ని సైన్యానికి చేరవేశారు. రంగంలోకి దిగిన సైన్యం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాల్ ప్రాంతంలోని సైమూ గ్రామంలో సబ్జార్ ఉన్న ప్రాంతాలను పసిగట్టింది. వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.
లొంగిపోవాలంటూ మైక్ ద్వారా తొలుత సైన్యం అనౌన్స్ చేసింది. భట్ నుంచి కాని, ఫైజాన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోగా... ఎలాంటి ఎదురు కాల్పులు కూడా ఎదురు కాలేదు. దీంతో, వారు తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు సైనికాధికారులకు అర్థమయింది. వారి దగ్గర భారీ ఎత్తున ఏకే47 తుపాకులు, తూటాలు, గ్రెనేడ్లు ఉన్నట్టు అప్పటికే సమాచారం ఉండటంతో... సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. మరోవైపు, ఎన్ కౌంటర్ జరగనున్న ప్రాంతానికి రాళ్లు రువ్వే అల్లరి మూకలను పంపాలని సబ్జార్ నుంచి అతని అనుచరులకు సందేశాలు వెళ్లాయి. దీన్ని సైన్యం పసిగట్టింది.
దీంతో, ఫైర్ ఇంజన్లలో నీళ్లకు బదులు పెట్రోల్ ను నింపి, ఉగ్రవాదులు దాక్కున్న ప్రాంతానికి రప్పించారు. వెంటనే ఒక ఇంటిపై పెట్రోల్ ను పంప్ చేసి, నిప్పు పెట్టారు. అయినా వారు బయటకు రాలేదు. దీంతో, రాత్రి 8.15 గంటలకు అక్కడున్న రెండో ఇంటి మీద కూడా పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో, భారీ ఆయుధాలతో సబ్జార్, ఫైజాన్ లు బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. ఈ ఆపరేషన్ లో సైన్యం చాలా రిస్క్ తీసుకుంది. పెట్రోల్ నింపిన ఫైరింజన్ వద్ద ఏదైనా తూటా పేలినా, గ్రెనేడ్ దాడి జరిగినా భారీ నష్టం సంభవించేది. కానీ మన సైనికులు ప్రాణాలకు తెగించి ముష్కరుల అంతు చూశారు.
తాము దాక్కున్న ఇంటిని భద్రతాదళాలు చుట్టుముట్టాయని తెలిసిన సబ్జార్ దాదాపు 10 గంటల సేపు ఇంట్లోనే ఉండిపోయాడు. భారీగా ఆయుధాలు ఉన్నప్పటికీ... ఎదురు కాల్పులు జరపలేదు. బయటకు రావడానికి కూడా సాహసించలేదు. ఈ సందర్భంగా ఆర్మీ ప్రతినిధులు మాట్లాడుతూ, సబ్జార్ ఓ పిరికివాడు అని అన్నారు.