: ఏ పాలన వద్దనుకున్నామో, ఇప్పుడు అదే నడుస్తోంది... ఇక పోరాటమే: కోదండరామ్
ఏ పాలనైతే వద్దనుకుని తెలంగాణను సాధించుకున్నామో... ఇప్పుడు అదే పాలన నడుస్తోందని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ బంగారు తెలంగాణను నిర్మిస్తుందనే ఆశతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని... కానీ, ప్రజల ఆశలు అడియాశలయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశించిన వారికి నిరాశే మిగిలిందని చెప్పారు. తెలంగాణలో నయా జాగీర్ పాలన నడుస్తోందని ఆయన విమర్శించారు.
మిషన్ కాకతీయ, భగీరథ పనుల్లో విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకుంటే, అందరికీ ఇళ్లు కట్టించి ఇవ్వొచ్చని అన్నారు. ప్రభుత్వం తీరుతో ఓపిక నశించిపోయిందని... ఇక పోరాటమే అని చెప్పారు. విలువల కోసం తాము పోరాటాన్ని కొనసాగిస్తామని... ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడబోమని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిస్సహాయులయ్యారని తెలిపారు.