: కుటుంబంతో సహా పారిపోయిన 'గోల్డ్ స్టోన్' ప్రసాద్... ఎనిమిది బృందాలతో గాలింపు!
మియాపూర్ లో వెలుగుచూసిన భారీ భూ కుంభకోణంలో 'గోల్డ్ స్టోన్' ప్రసాద్ హస్తం ఉందని అనుమానిస్తున్న పోలీసులు ఆయన్ను ప్రశ్నించేందుకు సన్నద్ధమవుతున్న వేళ, కుటుంబంతో సహా ప్రసాద్ పారిపోయాడు. ప్రసాద్ ఆచూకీ లభ్యం కాకపోవడం, ఆయనతో సహా ఆయన కుటుంబీకుల ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు ఓ అధికారి తెలిపారు.
ఈ కేసులో భాగంగా ప్రసాద్, ఆయన భార్య ఇంద్రాణి, కోడలు మమతలపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. వారు వెంటనే పోలీసుల ముందుకు వచ్చి విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రసాద్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎల్బీనగర్, మైలార్ దేవ్ పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో జరిగిన భూముల క్రయ విక్రయాల్లో అవకతవకలు జరిగాయని, వాటి వెనుక ప్రసాద్ హస్తం ఉన్నట్టు సాక్ష్యాలు లభించాయని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఇక ఆయన విదేశాలకు పారిపోకుండా నేడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయవచ్చని సమాచారం.