: సోనియాగాంధీ విందు సమావేశానికి ఆహ్వానం ఉన్నప్పటికీ.. వెళ్లలేదు: గవర్నర్ తో కేసీఆర్
రాష్ట్రపతి ఎన్నికల విషయమై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిర్వహించిన విందు సమావేశానికి తమకు కూడా ఆహ్వానం అందిందని.. కానీ వెళ్లలేదని గవర్నర్ నరసింహన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైనా, కాకపోయినా తమ మద్దతు ఎన్డీయేకేనని తెలిపారు. లౌకిక అభ్యర్థిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకగ్రీవ ఎన్నికకు తాము కూడా మద్దతిస్తామని యూపీఏ కూడా ప్రకటించిందని చెప్పారు. గవర్నర్ తో కేసీఆర్ నిన్న దాదాపు రెండు గంటల సేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ వివరాలను గవర్నర్ కు తెలిపారు. ఒకే వారంలో కేసీఆర్ రెండుసార్లు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జూన్ 2వ తేదీన ప్రభుత్వం నిర్వహించనున్న మూడవ అవతరణ వేడుకలకు హజరు కావాలని ఈ సందర్భంగా గవర్నర్ ను కేసీఆర్ ఆహ్వానించారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో 119 స్థానాల్లో 111 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని వివరించారు. ఇంకొంచెం కష్టపడితే 113 స్థానాలను కూడా గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలో తేలిందని చెప్పారు.