: సక్సెస్ అయితే చరిత్రే... 200 ఏనుగుల బరువున్న రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో!
చరిత్రలో నిలిచిపోయే ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిధ్దమవుతోంది. 200 ఏనుగుల బరువు కలిగిన అత్యంత శక్తిమంతమైన స్వదేశీ రాకెట్ ను ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేసింది. జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్ఎల్వీ) మార్క్-3గా పేర్కొంటున్న ఈ రాకెట్ ప్రయోగంతో పలు లక్ష్యాలను ఇస్రో అందుకోనుంది. జూన్ మొదటివారంలో శ్రీహరికోట నుంచి జరగనున్న ఈ భారీ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయితే... అతి పెద్ద ఉపగ్రహాలను ఇస్రో సునాయాసంగా కక్ష్యలో ప్రవేశపెట్టి మరిన్ని విజయాలు అందుకుంటుంది.
ఇప్పటికే క్రయోజెనిక్ ఇంజిన్ రాకెట్ ప్రయోగాల కోసం ప్రపంచ దేశాల నుంచి ఇస్రోకు ఆర్డర్లు పెరుగుతున్న సంగతి తెలిసిందే...ఈ నేపథ్యంలో 4 టన్నుల బరువుండే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను భూ అనువర్తిత కక్ష్య (జీటీవో) లోకి ప్రవేశ పెట్టేందుకు ఈ ప్రయోగం ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యంలో గణనీయమైన వాటాను ఒడిసిపట్టేందుకు ఇస్రోకు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. అందుకే భారీ రాకెట్ పరీక్షను విజయవంతం చేసేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ భారీ రాకెట్ ప్రయోగం కనీసం ఆరు సార్లు విజయవంతమైతే... ఆ తరువాత దీని ద్వారా వ్యోమగామిని భారత్ రోదసీలోకి పంపే అవకాశం కలుగుతుంది.
ఆ ప్రయోగం విజయవంతమై, రోదసీలోకి వ్యోమగామిని పంపితే రష్యా, అమెరికా, చైనా తరువాత వ్యోమగామిని ని అంతరిక్షంలోకి పంపిన దేశంగా మరో చరిత్రను భారత్ నెలకొల్పుతుంది. అంతేకాకుండా సుదూర అంతరిక్ష యాత్రలకు కూడా ఈ రాకెట్ ప్రయోగం స్పూర్తినిస్తుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో శక్తిమంతమైన క్రయోజెనిక్ ఇంజిన్ ను అభివృద్ధి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో తొలి ప్రయోగాల్లో ఇస్రో విఫలమైంది. అనంతరం వైఫల్యాలను విజయాలుగా మార్చుకుందన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయోగం మాత్రం తొలిసారే విజయవంతం చేయాలని భావిస్తోంది. అందుకు ఇస్రోలోని అన్ని విభాగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ మొదటి వారంలో 4 టన్నుల బరువున్న రాకెట్ ను భారత్ ప్రయోగించనుంది.