: తొలి వార్మప్ మ్యాచ్ లో టీమిండియాదే విజయం!
జూన్ 1 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీకి సన్నద్ధమయ్యేందుకు వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి వార్మప్ మ్యాచ్ ఆడిన భారత్ శుభారంభం చేసింది. ఇంగ్లండ్ లో అడుగుపెట్టిన అనంతరం జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు రోంచి (66), నీషమ్ (46) రాణించడంతో 34.4 ఓవర్లలో 189 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ ను టీమిండియా బౌలర్లు షమీ, భువనేశ్వర్, జడేజా కట్టడి చేశారు.
అనంతరం 190 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆకట్టుకుంది. శిఖర్ ధావన్ (40), విరాట్ కోహ్లీ (52) రాణించడంతో భారత జట్టు 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో ఆటకు అంతరాయం కలిగింది. అనంతరం వర్షం తగ్గకపోవడంతో ఆడేందుకు వెసులుబాటు లేక డక్ వర్త్ లూయిస్ పధ్ధతిలో విజేతను నిర్ణయించారు. దీంతో టీమిండియా 45 పరుగుల తేడాతో కివీస్ పై తొలి విజయం సాధించింది.