: చలపతి రావు వెకిలి వ్యాఖ్య చేసినప్పుడు మరి అక్కడే ఉన్న మీడియా ఎందుకు ప్రశ్నించలేదు?: సినీ నటి హేమ
మహిళల పట్ల పలువురు చేస్తోన్న వెకిలి వ్యాఖ్యల పట్ల, టీవీ ప్రోగ్రాంలలో సెటైర్ల పేరిట మహిళలపై చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఈ రోజు ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో సినీ నటి హేమ మాట్లాడి పలు ప్రశ్నలు వేశారు. టీవీ ప్రోగ్రాంలయిన జబర్దస్త్, పటాస్ లపై అతిగా మాట్లాడి మనమే అటువంటి ప్రోగ్రాంలకి పబ్లిసిటీ ఇస్తున్నామేమో అని తనకు అనిపిస్తోందని ఆమె అన్నారు. ఇక చలపతి రావు బాబాయి అలా మాట్లాడితే అక్కడే ఉన్న సినీనటులు, మహిళలు ఎందుకు మాట్లాడలేదంటూ, అప్పుడే తిట్టకూడదా? అంటూ మీడియా ప్రతిరోజూ పదే పదే ప్రశ్నిస్తోందని అన్నారు. అయితే, మరి ఆ సమయంలో అక్కడే ఉన్న మీడియా ఎందుకు అప్పుడు ఆయనను ప్రశ్నించలేదని ప్రశ్నించారు. మీడియాకు రెస్పాన్సిబిలిటీ లేదా? అలా మాట్లాడితే ఆడియో ఫంక్షన్లకు రాబోమని మీడియా ఎప్పుడయినా ప్రకటించిందా? అని నటి హేమ దుయ్యబట్టారు.
ఎప్పుడయినా సినీ నటీమణుల వద్దకు వచ్చి వారి ఇబ్బందుల గురించి మీడియా అడిగిందా? అని హేమ ప్రశ్నించారు. సినీ నటీమణులు అందరూ కలిసి ఓ అసోసియేషన్ పెట్టుకోండని సలహా ఇచ్చారా? అని ప్రశ్నించారు. న్యూస్ ఛానెళ్లలో ఓ నటి వ్యభిచారం చేస్తోందని ఓ సారి పదే పదే వేశారని, అలా ప్రసారం చేయడం కూడా తప్పు కదా? అని ఆమె అడిగారు. జబర్దస్త్ వంటి ప్రోగ్రాంలపై ప్రోగ్రాంలు నిర్వహించి విమర్శించే మీడియా మరి తాము చేస్తోన్న తప్పుపై ఏం సమాధానం చెబుతుందని ఆమె అన్నారు.