: ఇండియాకు వచ్చి రూ. 100కే ఆధార్ కార్డు పొందిన పాకిస్థానీలు


అందరికీ విశిష్ట గుర్తింపును అందించాలన్న సదుద్దేశంతో కేంద్రం తలపెట్టిన 'ఆధార్' ప్రాజెక్టు ఎంతగా దుర్వినియోగమవుతుందో తెలిపేందుకు ఇది మరో ఉదాహరణ. పాకిస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ముగ్గురు యువకుల వద్ద, తాము భారత్ పౌరులమేనని చెబుతూ, ఆధార్ కార్డులు లభ్యంకాగా, దీనిపై విచారణ జరిపిన పోలీసులు అవాక్కయ్యే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. ఓ మధ్యవర్తికి రూ. 300 చెల్లించిన వీరు మూడు ఆధార్ కార్డులను పొందారని తేల్చారు. దక్షిణ బెంగళూరు పరిధిలోని బాణశంకరి ప్రాంతానికి చెందిన ఓ మధ్యవర్తికి కరాచీ నుంచి వచ్చిన పాక్ పౌరులు కిర్హోన్ గులామ్ అలీ (26), ఖాసిఫ్ షంషుద్దీన్ (30), సమీరా అబ్దుల్ రెహమాన్ (25)లు ఈ డబ్బివ్వగా, వారికి అతను ఆధార్ కార్డులను సమకూర్చాడు.

 కాగా, కిర్హోన్ ను ఖాసిఫ్ పెళ్లి చేసుకోగా, సమీరాను కేరళకు చెందిన షిహాబ్ వివాహం చేసుకున్నాడు. ఈ నలుగురూ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. తమకు ఆధార్, ఓటర్ కార్డులను ఇచ్చేందుకు తొలుత రూ. 500 డిమాండ్ చేశారని, అంత డబ్బు ఇచ్చుకోలేమని బతిమిలాడుకున్న తరువాత రూ. 100కు వాటిని ఇచ్చాడని విచారణలో వీరు వెల్లడించారు. ఇక ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కు వీరి అరెస్ట్ విషయమై లేఖ రాసిన బెంగళూరు అధికారులు, వీరు కరాచీ వాసులేనా? అన్న విషయాన్ని ధ్రువీకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం సమీరా నాలుగు నెలల గర్భవతిగా ఉండగా, మదివాలాలోని ప్రత్యేక ఇంటరాగేషన్ సెల్ లో ఇద్దరు నర్సులను సాయంగా ఉంచి ఆమెను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News