: 3వ యోగా దినోత్సవాన్ని ఇలా చేసుకుందాం: భారతీయులకు మోదీ సలహా
మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమవుతున్న వేళ, ఆ క్షణాలను మరింత గుర్తుంచుకునేలా చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులకు ఓ సలహా ఇచ్చారు. ఈ ఉదయం మన్ కీ బాత్ లో మాట్లాడుతూ, యోగా దినోత్సవం రోజున ప్రతి ఇంటిలోని మూడు తరాల వారూ కలసి యోగా ఎందుకు చేయరాదని ప్రశ్నించారు.
ఆరోగ్యాన్ని అందించే యోగాను ఓ ఇంట్లోని మూడు తరాల వారూ కలసి చేస్తే చూడాలని ఉందని చెప్పారు. మన పూర్వ తరాల ప్రజలు ప్రకృతిని కాపాడారని, వారి దారిలోనే నడిచి భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రకృతితో మమేకం కావడమంటే, మనతో మనం మమేకం అవడమేనని అభివర్ణించారు. స్వచ్ఛ భారత్ ను మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన మన్ కీ బాత్ ప్రసంగాల పుస్తకాన్ని ఆవిష్కరించారని, ఆ క్షణాలు తనకెంతో మధురమైనవని మోదీ చెప్పారు. నిర్మాణాత్మక విమర్శలు వస్తే తానెంతో సహృదయంతో స్వీకరిస్తానని, అదే ప్రజాస్వామ్యానికి బలమని వ్యాఖ్యానించారు.