: తెలుగుదేశం తెలంగాణలో చచ్చింది, ఏపీలో ఉన్నా లేనట్టే: లక్ష్మీ పార్వతి
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చచ్చిపోయిందని, ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ ఉన్నా లేనట్టేనని దివంగత ఎన్టీ రామారావు సతీమణి, వైకాపా నేత లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి తన భర్తకు నివాళులు అర్పించిన ఆమె, మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ సార్థకతను కోల్పోయిందని, ఇప్పుడా పార్టీకి తెలంగాణలో మనుగడే లేదని అన్నారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ బతికున్నంతకాలం, ప్రతి మహానాడులో కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. 1982లో కిలో బియ్యం రూ. 2 పథకాన్ని తెచ్చారని, బీసీలు, మైనారిటీలకు రాజ్యాధికారాన్ని దగ్గర చేశారని చెప్పారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వంటి కీలక నిర్ణయాలు అమలు చేసిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.