: నా చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుజాతి కోసం పోరాడుతా: సీఎం చంద్రబాబు
తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగుజాతి కోసం పోరాడతానని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ వేదికగా ప్రారంభమైన మహానాడులో ఆయన మాట్లాడుతూ, తెలుగు వారందరూ గుర్తుపెట్టుకునే వ్యక్తి ఎన్టీఆర్ అని, ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించాల్సి ఉందని అన్నారు. కార్యకర్తల చొరవ వల్లే టీడీపీకి ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చిందని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేయాలని, రెండేళ్లకోసారి ఆర్గనైజేషన్ ఎన్నికలు, ఏడాదికోసారి టీడీపీ మహానాడు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన వ్యక్తి ఎన్టీఆర్ అని, పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసించారు.
ఎన్టీఆర్ మండలిక, సింగిల్ విండో వ్యవస్థ ఏర్పాటు చేశారని, బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, శాశ్వత భవన నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని ఆయనేనని అన్నారు. ప్రజల కోసం పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు అర్థం చేసుకున్నానని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన కోసం దోహదం చేసిందని విమర్శించారు. రెండు ప్రాంతాలకు అన్యాయం జరగకుండా కలిసి ఉండాలని కోరానని, హేతుబద్ధత లేని విభజన వల్ల ప్రజలకు ఇబ్బందులు వచ్చాయని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పార్లమెంటులో పెట్టారు తప్పా, చట్టబద్ధత ఇవ్వలేదని, ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారని, హోదాకు బదులు ప్యాకేజ్ హామీ ఇచ్చారని చెప్పారు.
ఏపీ రాజధాని విషయంలో కొంత వరకు కేంద్రం ఆదుకుందని, రాజధానిని బ్రహ్మాండంగా కట్టుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. తెలంగాణలో ప్రాజెక్టుల కోసం ఆ రోజు చాలా ప్రాధాన్యత ఇచ్చామని, దేవాదుల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చామని, పెట్టుబడుల కోసం అమెరికాలో పద్నాలుగు రోజులు కాలినడకన తిరిగానని, పెట్టుబడులు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని కష్టపడ్డానని, ఈ రోజు హైదరాబాద్ నాలెడ్జ్ సొసైటీగా తయారైందని, హైదరాబాద్ కు ఆదాయం వస్తోందంటే ఆ రోజు టీడీపీ వేసిన పునాదే కారణమని చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.