: ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల భారీ వర్షం
ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షాలధాటికి విశాఖపట్నం, ప్రకాశం, కడప జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలం, గొల్లపల్లిలో పిడుగుపాటుకి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెద్దారవీడు మండలం, చింతలముడిపి తండాలో గాలి వాన బీభత్సంతో ఇంటిగోడ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురవడంతో భారీగా పంటనష్టం సంభవించింది. విశాఖపట్నంలోని పాడేరులో ఈదారుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి కిందపడ్డాయి. ఈదురుగాలుల బీభత్సానికి చెట్లు నేలకొరిగాయి, రేకుల షెడ్లు కొట్టుకుపోయాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రొద్దుటూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.