: యోగి ప్రభుత్వంలోని కీలక మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ ను నేరాలు లేని రాష్ట్రంగా మారుస్తామనే హామీని తాము ఎన్నడూ ఇవ్వలేదని యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని కీలకమంత్రుల్లో ఒకరైన సురేష్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. నేరస్తులకు కళ్లెం వేస్తామని హామీ ఇస్తున్నామని చెప్పారు. యూపీలో నేరాలు జరగకుండా ఆపడం చాలా కష్టమని తెలిపారు. యూపీ చాలా పెద్ద రాష్ట్రమని... నేరాలను పూర్తిగా నియంత్రించడం కష్టసాధ్యమని అన్నారు. సహరాన్ పూర్ లో మత ఘర్షణలు తలెత్తడంతో యోగి సర్కార్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు యమునా ఎక్స్ ప్రెస్ వేపై ఒకే కుటుంబానికి చెందిన నలుగురిపై అత్యాచారం చేసి, ఇంటి యజమానిని హత్య చేసిన ఘటన రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో నేరాలను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సురేష్ ఖన్నా మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.