: ఈ దున్నపోతులు బాగా కాస్ట్ లీ గురూ!.. 'యువరాజు' 9 కోట్లు... సుల్తాన్ 21 కోట్లు పలుకుతున్నాయ్!
హర్యాణాకు చెందిన రెండు దున్నపోతుల ధర వింటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే, వాటి ధర కోట్లలో ఉంటుంది. ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు రాజస్థాన్ లోని కోటాలో ‘గ్లోబర్ రాజస్థాన్ అగ్రిటెక్ మీట్’ జరుగుతోంది. ఇందులో ప్రధాన ఆకర్షణగా ముర్రాజాతికి చెందిన సుల్తాన్, యువరాజ్ అనే దున్న పోతులు నిలుస్తున్నాయి. గతంలో యువరాజ్ ను 9 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తానని ఒక వ్యక్తి ముందుకు రాగా, దానిని విక్రయించేందుకు దాని యజమాని కరంవీర్ సింగ్ నిరాకరించారు. ఈ యువరాజ్ గతంలో హైదరాబాదులోని ఒక వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దానికి పోటీగా సుల్తాన్ వచ్చింది.
దీనిని కొనుగోలు చేస్తానంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ఒక వ్యాపారి 21 కోట్ల బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఈ ఆఫర్ ను సుల్తాన్ యజమాని నరేష్ బేనివాల్ నిర్ద్వద్వంగా తిరస్కరించారు. మేలు జాతి పాడి గేదెల ఉత్పత్తికి ఉపయోగపడే ఈ దున్నపోతుల వీర్యానికి భారీ డిమాండ్ ఉంది. తమకు వాటితో విడదీయలేని అనుబంధం ఉందని, డబ్బుకు ఆశపడి వాటిని దూరం చేసుకోలేమని వారిద్దరూ స్పష్టం చేశారు. కాగా, సుల్తాన్ ఒక్కో తడవకు 6 మిల్లీ లీటర్ల వీర్యాన్ని ఇస్తుండగా, దానిని శాస్త్రీయ పద్దతిలో 600 డోసులుగా తయారు చేసి, ఒక్కో డోసును 250 రూపాయలకు విక్రయిస్తున్నట్టు నరేష్ తెలిపారు.
ఇలా ఏడాదికి సుల్తాన్ 54,000 డోసులు ఇస్తుండగా, యువరాజ్ 45,000 డోసుల వీర్యం ఇస్తోంది. ఇలా ప్రతి ఏటా పెద్ద మొత్తంలో కరమ్ వీర్ సింగ్ కు ఆదాయమ వస్తోంది. ఇక వీటికి రోజుకు ఆహారంగా 20 లీటర్ల పాలతో పాటు ఆరోగ్యవంతమైన, బలవర్ధకమైన దాణా తినిపిస్తారు. రోజుకు మూడు సార్లు స్నానం చేయిస్తారు. ఏసీ, ఫ్యాను వంటి ఇతర సౌకర్యాలు సరేసరి.