: అబ్బాయిగా అమ్మాయి 'దొంగ'వేషాలు!
అమెరికాలోని కాలిఫోర్నియాలోని డాన్ విల్లేలోని ఒక బ్యాంకులో రెండు రోజుల క్రితం దొంగతనం జరిగింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ పుటేజ్ పరిశీలించిన పోలీసులు 5.8 అంగుళాల ఎత్తు కలిగిన, నల్ల టీ షర్టు, సన్ గ్లాసెస్, క్యాప్ పెట్టుకున్న ఓ సన్నపాటి వ్యక్తి బ్యాంకుకు వచ్చి సిబ్బందిని బెదిరించి, డబ్బు తీసుకుని పరారయ్యాడని గుర్తించారు. అనంతరం అతని ఫోటోలు విడుదల చేసి, సిబ్బందిని విచారించారు. దీంతో దొంగ గడ్డం ధరించి లేడని, గడ్డం పెయింట్ చేసుకున్నాడని వారు చెప్పడంతో మరోసారి సీసీ పుటేజ్ పరిశీలించారు.
నడక, నడత అన్నీ తేడాగా ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు. దీంతో క్యాషియర్ ను బెదిరించి ఎత్తుకెళ్లిన వ్యక్తిని గుర్తించి అవాక్కయ్యారు. ఎందుకంటే దొంగ అబ్బాయి కాదు. అమ్మాయి. ఆమె కూడా గతంలో పోలీసు ఆఫీసర్ గా పని చేసిన జెన్నిఫర్ మెక్ క్లారీ (36) గా గుర్తించారు. అయితే ఆమె పనితీరు బాగోలేకపోవడంతో ఆమెను 2010లో విధుల నుంచి తప్పించారు. దీంతో ఆమె దొంగ అవతారమెత్తి, ఏకంగా బ్యాంకునే దోచుకుంది. దీనిని గుర్తించిన పోలీసులు, ఆమెను అరెస్టు చేశారు.