: హైదరాబాద్ కంటే రెట్టింపు అద్దెలు విజయవాడలో ఉన్నాయి: సీఎం చంద్రబాబు
విజయవాడలో అద్దెలు మండుతున్నాయని, హైదరాబాద్ కంటే రెట్టింపు అద్దెలు ఉన్నాయని, ఇక్కడి ఇంటి అద్దెలు నియంత్రించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలో హోటళ్లు కూడా ధరలు పెంచేశాయని, ఇది సరైన పద్ధతి కాదని చంద్రబాబు అన్నారు. పాఠశాలలు, కళాశాలల బస్సులను విద్యా సంవత్సరానికి ముందే తనిఖీలు చేయాలని, ర్యాగింగ్ జరగడానికి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని, రాజధాని ప్రతిష్ట పెరిగేలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
కాగా, అమరావతిలో కలెక్టర్ల సదస్సులో భాగంగా శాంతి భద్రతలపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, పోలీసింగ్ లో ఆధునిక సాంకేతికతపై చర్చించారు. సహజంగానే ఏపీ ప్రజలు శాంతి కాముకులని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు రాష్ట్రంలో తక్కువని, ఏపీలో చారిత్రక నేపథ్యంలో ఫ్యాక్షన్ తరహా సమస్యలు ఉన్నాయని అన్నారు. నాగరిక సమాజంలో అభివృద్ధికి శాంతిభద్రతలు చాలా ముఖ్యమని, రౌడీయిజం, అభద్రత ఉంటే అభివృద్ధికి విఘాతమని, ఫ్యాక్షన్ నేతలపై నిరంతర నిఘా ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు.
ఎర్రచందనం, స్మగ్లింగ్, గంజాయి సాగు నివారించకపోతే నేరాలు పెరుగుతాయని, స్మగ్లర్లు రాజకీయనాయకులుగా మారే ప్రమాదం ఉందని, నూతన సాంకేతికతను వినియోగించుకుని నేరగాళ్లు చెలరేగిపోతారని అన్నారు. సాంకేతికతపై పోలీసులు ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలని, జిల్లాల్లో జరిగే ప్రమాదాలపై జిల్లా యంత్రాంగాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అధిక వేగాన్ని వెంటనే నియంత్రించాలని, రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భూమి విలువ బాగా పెరగడంతో భూ కబ్జాలు పెరిగే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.