: కొందరికి బీపీ పెరుగుతోంది: అమిత్ షా ఎద్దేవా
తెలంగాణకు లక్ష కోట్లకు పైగా ఇచ్చామని తాను నిన్ననే చెప్పానని, ఇప్పుడు కూడా తాను అదే మాట చెబుతున్నానని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ రోజు నల్గొండ జిల్లాలో తన పర్యటన ముగుస్తోన్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... తమ పార్టీ తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు. బీజేపీని ప్రతి ప్రాంతంలోనూ బలోపేతం చేస్తామని అన్నారు. తాను తెలంగాణ పర్యటన ముగించుకొని వెళ్లేలోపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని కేసీఆర్ అన్నారని గుర్తు చేసిన అమిత్ షా... వివిధ పథకాల అమలుకు తెలంగాణకు రూ.12 వేల కోట్లు ఇచ్చామని అన్నారు. తెలంగాణకు చేయాల్సిన సాయం చేస్తూనే ఉన్నామని చెప్పారు. కొందరికి మాత్రం బీపీ పెరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 106 పథకాలను అమలుపరుస్తోందని అమిత్ షా అన్నారు.
అన్ని రాష్ట్రాల్లోను బీజేపీ అధికారంలోకి వస్తోందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారు. కేంద్ర అమలు చేస్తోన్న పథకాల గురించి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకోగలమని అన్నారు. తమ పార్టీని మరింత విస్తరించుకునే హక్కు తమకు ఉందని అన్నారు. ఇప్పటికే 13 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, మరో 4 రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతిస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. ఇక తెలంగాణలోనూ విజయం తథ్యమని అన్నారు. పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణాలిచ్చేందుకైనా తాను సిద్ధమని అన్నారు.
మోదీ నేతృత్వంలో భారత్‌లో మంచి పాలన కొనసాగుతోందని అమిత్ షా అన్నారు. జన్‌ధన్ పథకం కింద 28 కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరిచామని అన్నారు. ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించామని చెప్పారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అన్నదే తమ నినాదమని చెప్పారు. 70 ఏళ్లలో చేయలేని దానిని తాము మూడేళ్లలో్ చేసి చూపించామని అన్నారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్.. ఇలా ఏ రాష్ట్రం చూసుకున్నా తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తూ దూసుకుపోతోందని చెప్పారు. తెలంగాణకు తాము ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలెన్నో ఇచ్చామని అన్నారు. తాను మూడు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నానని, రాష్ట్రంలోనూ పార్టీని విస్తరిస్తానని అన్నారు. పేదలు, దళితులు, ఆదివాసీలు, పీడితుల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.