: దేవుడు పంపిన దూత నరేంద్ర మోదీ: వెంకయ్యనాయుడు
దేవుడు పంపించిన దూత నరేంద్ర మోదీ అని ప్రజలు భావిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. హైదరాబాద్ లో పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, దేశంలో బీజేపీ బలోపేతానికి మోదీ సంకల్పించారని, నవభారత నిర్మాణం కోసం మోదీ కృషి చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెప్పారు.
యాభై ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, భారత్ ను శక్తిమంతంగా చేయాల్సిందిపోయి, జనాన్ని చీల్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ విధానాల వల్ల మతఛాందసవాదులకు బలం చేకూరిందని, కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు ఒనగూరిందేమిటని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ మహా మత ఛాందసవాద పార్టీ అని, ఆ పార్టీలో ముస్లింలకు ఎటువంటి ప్రయోజం లేదని, అందుకు ఉదాహరణగా హైదరాబాద్ పాతబస్తీని చెప్పవచ్చని,అక్కడి ముస్లింలు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో అక్కడికి వెళ్లి చూస్తే అర్థమవుతుందని వెంకయ్యనాయుడు అన్నారు.