: తెరాట్పల్లిలో అమిత్ షా తిన్నది దళిత భోజనం కాదు: సీఎం కేసీఆర్ విమర్శలు
భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ దళిత భోజనం అంటూ నాటకాలాడిందని అన్నారు. తెరాట్ పల్లిలో అమిత్ షా తిన్న భోజనం దళితవాడలో వండనేలేదని కేసీఆర్ తెలిపారు. పక్కనే ఉన్న కమ్మగూడెంలోని మనోహర్ రెడ్డి అనే వ్యక్తి వండి తీసుకొచ్చారని చెప్పారు. బీజేపీ చేసే గిమ్మిక్కులు మాకు తెలియవా? అని ఆయన అన్నారు. దళితవాడలో సహ బంతి భోజనం అంటూ ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. అక్కడ ఓ దళిత వ్యక్తిని నిలబెట్టి అమిత్ షా భోజనం చేశారని, అది టీవీల్లోనూ కనిపించిందని చెప్పారు.
‘మీ అసలు స్వరూపం మాకు తెలియదా? మీరొచ్చి అదీ ఇదీ అంటే మేము నమ్మేస్తామా? తెలంగాణ లాంటి గడ్డ మీద మీరు ఇటువంటి రాజకీయాలు చేస్తామంటే అది సాధ్యంకాదు.. నడవదు..’ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వచ్చి ఏవేవో మాట్లాడి ఇక్కడ రచ్చ రచ్చ చేస్తానంటే కుదరదని అన్నారు. తమ సర్కారు మాత్రం దళితుల కోసం పకడ్బందీగా ఉపప్రణాళిక తీసుకొచ్చిందని అన్నారు. తెలంగాణ సమాజం బీజేపీని క్షమించదని, రాష్ట్రాన్ని దెబ్బతీసేవిధంగా మాట్లాడిందని అన్నారు.