: పోప్ ఫ్రాన్సిస్ ను కలిసిన ట్రంప్
రోమన్ క్యాథలిక్కుల మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ ను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రోమ్ లో కలుసుకున్నారు. ఇజ్రాయిల్ నుంచి నేరుగా రోమ్ చేరుకున్న ట్రంప్ కుటుంబ సభ్యులందరితో కలిసి పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు. ఈ సందర్భంగా పోప్ వారందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేశారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, వెల్లడించిన పలు అభిప్రాయాలతో పోప్ ఫ్రాన్సిస్ విభేదించారు. ప్రపంచ శ్రేయస్సుకు సమన్వయంతో పని చేయాలని, దుడుకు నిర్ణయాలు మంచిది కాదని హితవు పలికారు. ఈ భేటీ నేపథ్యంలో ట్రంప్ పలు విషయాలపై పోప్ తో సుమారు 29 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా ట్రంప్ కుటుంబాన్ని పోప్ ఆశీర్వదించారు. అనంతరం ట్రంప్ ఇటలీ దేశాధ్యక్షుడు సర్గియో మాటరెల్లా, ప్రధాని పౌలో జెంటిలోనితో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి బ్రసెల్స్ లో జరిగనున్న నాటో సదస్సులో పాల్గొననున్నారు.