: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారి విభిన్నంగా కనిపిస్తున్న టీమిండియా
ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చే నెల 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్ల బలాబలాలపై పెద్ద చర్చ నడుస్తోంది. భారత జట్టుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీమిండియా బౌలింగ్ పటిష్ఠంగా కనిపిస్తుండగా, బ్యాటింగ్ పేలవంగా కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. టీమిండియా ప్రాక్టీస్ కు అవసరమైనన్ని టీ20 మ్యాచ్ లు ఐపీఎల్ కారణంగా ఆడింది. టీమిండియా ఆటగాళ్లందరికీ మంచి ప్రాక్టీస్ లభించింది. అయితే ప్రాక్టీస్ గా పేర్కొంటున్న ఐపీఎల్ లో బౌలర్లు రాణించినంత గొప్పగా బ్యాట్స్ మన్ రాణించలేదన్న సంగతి తెలిసిందే. భువనేశ్వర్ కుమార్ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకోగా, బుమ్రా అతనికి దీటుగా బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. ఉమేష్ యాదవ్ కూడా ఆకట్టుకోగా, ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, హార్డిక్ పాండ్యా కూడా రాణించారు. దీంతో బౌలింగ్ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్ఠంగా కనిపిస్తోంది.
పిట్ నెస్ సమస్యలతో పాటు, ఫాంపై అశ్విన్, షమి మాత్రమే ఆందోళనలో ఉన్నారు. అయితే టచ్ లోకి వస్తే వీరి బంతులకు ఎంతటి బ్యాట్స్ మన్ అయినా చిత్తు కావాల్సిందే. అదీ కాక పేస్ బౌలింగ్ కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్ లపై షమి ఫాంలోకి రావడం పెద్ద కష్టం కాదు. ఇక బ్యాటింగ్ విభాగంలోకి వస్తే... విరాట్ కోహ్లీ గత టోర్నీలో పెద్దగా రాణించలేదు. ధావన్ పెద్దగా ఆకట్టుకోలేదు. రోహిత్ కు తిరుగులేదు, అయితే నిలకడలోపం ఎక్కువ. రహానే ఫర్వాలేదనిపించాడే కానీ, భారీ స్కోర్లు లేవు. దినేష్ కార్తీక్ ఫాం ఫర్వాలేదు. కేదార్ జాదవ్ ఆకట్టుకున్నా ఎక్కువ మ్యాచ్ లు ఆడలేదు. మహేంద్ర సింగ్ ధోనీ నిలకడ లోపం కనబడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేయనుందన్న ఆందోళన అందర్లోనూ కనిపిస్తోంది. టోర్నీలో ఎలా ఆడినా ఆరంభ మ్యాచ్ లో మాత్రం పాక్ ను ఓడించాలని సగటు టీమిండియా అభిమాని కోరుకుంటున్నాడు.