: హింసాత్మకంగా మారిన రాయలసీమ బంద్... ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం
రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు చేపట్టిన బంద్ కు కాంగ్రెస్ మద్దతివ్వడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అనంతపురం జిల్లా గుంతకల్లులో నిరసనకారులు రెచ్చిపోయి, రోడ్లపైకి వచ్చిన బస్సులను ధ్వంసం చేశారు. అద్దాలు పగులగొట్టి తమ ప్రతాపం చూపారు. అనంతపురంలోనూ వామపక్ష నేతలు బస్సులను అడ్డుకొని వాటి టైర్లలో గాలిని తీసేశారు.
తిరుపతిలో బస్టాండు ముందు పలు పార్టీల కార్యకర్తలు నిరసనలకు దిగి డిపో నుంచి ఒక్క బస్సును కూడా బయటకు రానీయకపోవడంతో తిరుమలకు వెళ్లాలని వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మదనపల్లి, పీలేరు, కదిరి, గుత్తి, డోన్ తదితర ప్రాంతాల్లోనూ నిరసనకారులు రోడ్లపైకి వచ్చి హింసాత్మక ఘటనలకు దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీరిని అదుపు చేసేందుకు ఎక్కడికక్కడ భారీ ఎత్తున పోలీసులను, ప్రత్యేక బలగాలను మోహరించారు. పలు చోట్ల ఆందోళనకారులను బలవంతంగా తీసుకెళ్లి అరెస్టులు చేశారు.