: 'వాన్నాక్రై' ధాటికి హైదరాబాదులో మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలు 'క్రై'!
ఉత్తరకొరియాలోని లాజరస్ గ్రూప్ హ్యాకర్లు చేసిన 'వాన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడి బారిన హైదరాబాదులోని మూడు సాఫ్ట్ వేర్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. హ్యాకర్లు అడిగిన మొత్తం చెల్లించకపోవడంతో మూడు కంపెనీల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. దాని వివరాల్లోకి వెళ్తే... జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లో చెవ్రోన సాఫ్ట్ వేర్, ఓప్లెంటస్ గ్రీన్స్ కన్సల్టెన్సీస్, మోర్ వీసాస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు 'వాన్నాక్రై' హ్యాకర్ల బారిన పడ్డాయి. చెవ్రోన సాఫ్ట్‌వేర్ కంపెనీ ఐటీ ఆధారిత ఉత్పత్తులు, సేవలను అందిస్తుండగా, వీరికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో క్లయింట్స్ ఉన్నారు. అలాగే ఒప్లెంటస్ గ్రీన్స్ కన్సల్టెన్సీస్ సంస్థ విదేశీ విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సహకరిస్తుంది. ఇక మోర్ వీసాస్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సంస్థ వీసా లావాదేవీలు చూస్తుంది. ఈ మూడు సంస్థలూ అనుబంధ సంస్థలుగా సమన్వయంతో పని చేస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.
అంతర్గత సమాచారం కోసం ఇంట్రానెట్ ను వినియోగిస్తుంటాయి. వారం కిందట, మోర్ వీసాస్ ఉద్యోగులు విధుల్లో ఉండగా 'వాన్నాక్రై' బారిన పడ్డాయి. అయితే అప్రమత్తమయ్యేలోపు మిగిలిన రెండు సంస్థల్లోని కంప్యూటర్లు కూడా లాక్ అయిపోయాయి. దీంతో 'వాన్నాక్రై' హ్యాకర్లను సంప్రదించగా, వారు బిట్ కాయిన్ల రూపంలో కొంత మొత్తం డిమాండ్ చేశారు. వారడిగిన మొత్తం చెల్లించినా కంప్యూటర్లను తిరిగి సాధారణస్థితికి తెస్తారన్న గ్యారెంటీ లేకపోవడంతో ఈ సంస్థల యాజమాన్యం మౌనంగా ఉంది. దీంతో హ్యాకర్లు పెట్టిన గడువు దాటిపోవడంతో మొత్తం డేటాను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. డేటాను తెచ్చుకునే మార్గం లేకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా, కేరళలోని తిరువనంతపురంలోని దక్షిణ రైల్వే కార్యాలయంలోని ఆరు కంప్యూటర్లు 'వాన్నాక్రై' ర్యాన్సమ్ వేర్ బారిన పడ్డాయి.