: ఐటీ ఉద్యోగులకు అభయం.. వచ్చే 4-5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాలు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్


ఉద్వాసన భయంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్న సమయంలో కేంద్రం ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీపికబురు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 20-25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. మూడేళ్ల మోదీ పాలనలో తన మంత్రిత్వశాఖ సాధించిన విజయాల గురించి ఓ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.

డిజిటల్ ఎకానమీ రోడ్ మ్యాప్ తయారీ  కోసం కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీని నియమించినట్టు పేర్కొన్నారు. వచ్చే 5-7 ఏళ్లలో దేశంలోని డిజిటల్ ఎకానమీ ఒక ట్రిలియన్‌కు చేరుకుంటుందన్నారు. నోట్ల రద్దు తర్వాత మొబైల్ వాలెట్స్ ద్వారా చేసే డిజిటల్ పేమెంట్స్ 104 శాతం పెరిగి 44.3 లక్షలకు చేరుకున్నట్టు వివరించారు. యూపీఐ పేమెంట్స్ 3.31 లక్షలకు, ఆధార్ చెల్లింపులు 1.58 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఐటీ రంగం నుంచి ఉద్యోగులు పెద్దమొత్తంలో ఉద్వాసనకు గురికానున్నట్టు వస్తున్న వార్తను ఖండించిన రవిశంకర్ ప్రసాద్ వచ్చే నాలుగైదేళ్లలో 20-25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్టు చెప్పారు. గత మూడేళ్లలో ఐటీ రంగంలో 6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగినట్టు పేర్కొన్నారు. ఒక్క 2016-17లో 1.7 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News