: అనారోగ్యంతో తాంత్రికుడు చంద్రస్వామి మృతి!
వివాదాస్పద తాంత్రికుడు చంద్రస్వామి(66) మృతి చెందారు. ఈ మేరకు అపోలో ఆసుపత్రి వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధ్మాత్మిక గురువు జగదాచార్య చంద్రస్వామీజీ (66) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే గుండెపోటుకు గురైన చంద్రస్వామి శరీర అవయవాలు దెబ్బతినడంతో ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందారు’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, జ్యోతిష్యంలో దిట్టగా పేరుపొందిన చంద్రస్వామి, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో, చంద్రస్వామి పేరు అందరికీ సుపరిచితమైంది.
ఓ రకంగా పీవీ నరసింహారావుకు ఆధ్మాత్మిక గురువు చంద్రస్వామి అని చెబుతుంటారు. నరసింహారావు ప్రధాని అయిన తర్వాత ఢిల్లీలో విశ్వ ధర్మాయతన్ సంస్థాన్ ఆశ్రమాన్ని చంద్రస్వామి స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు కూడా చంద్రస్వామి ఆధ్యాత్మికగురువుగా వ్యవహరించారని అంటారు.