: క్రికెటర్ల భద్రతకు ఢోకా లేదు... బీసీసీఐకి ఐసీసీ హామీ!
ఇంగ్లాండులోని మాంచెస్టర్ లో బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో క్రికెటర్లకు ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారంటూ ఐసీసీకి బీసీసీఐ ఓ లేఖ రాసింది. జూన్ 1 నుంచి 18వ తేదీ వరకూ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ ట్రోఫీలో 8 దేశాలు పాల్గొననున్న నేపథ్యంలోనే బీసీసీఐ ఈ లేఖ రాసింది. క్రికెటర్ల భద్రత కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని పేర్కొంది. ఈ లేఖపై ఐసీసీ స్పందించింది. క్రికెటర్లకు భద్రత కల్పిస్తామని, ఈ విషయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)తో కలిసి పనిచేస్తామని పేర్కొంది. క్రికెటర్లకు భద్రత కల్పించే విషయమై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జూన్ 24 నుంచి జులై 23 వరకూ మహిళల ప్రపంచకప్ నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నామని ఐసీసీ ప్రతినిధులు తెలిపారు.