: న్యూస్ రీడర్ లైవ్‌లో వార్తలు చదువుతోంది.. ఇంతలో ఓ కుక్క అక్కడికి వచ్చేసింది!
లైవ్‌లో సీరియస్‌గా వార్తలు చదువుతున్న వేళ ఓ న్యూస్ రీడర్ పక్కకు హఠాత్తుగా ఓ కుక్క వచ్చిన సంఘటన రష్యాలోని ఓ న్యూస్ ఛానల్‌లో చోటు చేసుకుంది. ఆ సమయంలో సదరు న్యూస్ రీడర్ మాస్కో డిమాలిషన్ గురించి చెబుతోంది. ఇంతలో ఆమెకు ఏదో చిన్న చప్పుడు వినపడింది. అనంతరం డెస్క్ కింద ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దీంతో లైవ్ ప్రసారం అవుతుండగానే వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ల ముందు ఓ నల్లటి శునకం కనపడింది. అయినా తన పనిని ఆపకుండా వార్తలు చదివింది. ఆమె ముఖంలో కొంత భయం, కొంత వణుకు కనిపించాయి. ఇంతలో ఆ కుక్క టేబుల్ మీదకు ఎక్కి పేపర్లను తన నోటితో తీసేందుకు యత్నించింది. ఈ దృశ్యం అంతా లైవ్‌లో కొన్ని సెకన్ల పాటు ప్రసారం అయింది. అనంతరం ఆ కుక్కను గోముగా పట్టుకొని ఆ న్యూస్ రీడర్ నవ్వేసింది. ఈ వీడియోను సదరు న్యూస్ ఛానల్ యూట్యూబ్‌లో పోస్టు చేయగా దీనిని లక్షలాది మంది వీక్షించారు.