: టీడీపీ వ్యాఖ్యలతో బీజేపీకి నష్టం లేదు... ఏపీలో విస్తరించడమే లక్ష్యం: హరిబాబు
తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీకి ఎటువంటి నష్టమూ కలగబోదని ఆ పార్టీ నేత హరిబాబు వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, 25న బీజేపీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే సభను విజయవంతం చేసి చూపిస్తామని తెలిపారు. కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయమా? అన్నది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓ జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించాలన్న కోరిక బీజేపీకి ఉందని, అందులో భాగంగానే బూత్ కమిటీ సభ్యుల మహా సమ్మేళనంలో అమిత్ షా దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల అమలు తీరును ఆయనే స్వయంగా వివరిస్తారని అన్నారు. బీజేపీతో పొత్తు కారణంగా మెజారిటీ తగ్గిందని చేసే వ్యాఖ్యలు సరికాదని, పార్టీ పరంగానే అటువంటి వ్యాఖ్యలు చేశారని భావిస్తే, అప్పుడు తాము కూడా పునరాలోచన చేసుకుంటామని హరిబాబు తెలిపారు.